హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకుడి కాల్వను ఆపరేట్ చేసేందుకు అనుమతివ్వాలన్న ఏపీ విజ్ఞప్తిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణకు కృష్ణా బోర్డు సూచించింది. సాగర్‌నుంచి మరో 73.50 టీఎంసీల నీళ్లివ్వాలన్న అంశంపైనా స్పందన తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఈఎన్సీ జనరల్‌కు లేఖ రాసింది. గత నెలలో సాగర్‌కుడి కాల్వను ఆపరేట్చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ రాసింది.
ఈ కాల్వ పవర్హౌస్ద్వారా 535 అడుగుల వరకే నీళ్లను తీసుకోవడానికి వీలవుతుందని, ఆ తర్వాత తీసుకోలేమని తెలిపింది. ఇప్పటికే సాగర్ ఆయకట్టు కింద పంటలు, తాగునీటి అవసరాలు ఉన్నాయి కాబట్టి కుడి కాల్వహెడ్రెగ్యులేటర్ను తాము ఆపరేట్ చేసుకునేలా సీఆర్పీఎఫ్కు ఆదేశాలివ్వాలని కోరింది. అంతేకాకుండా, కృష్ణాలో నీటి వినియోగంపైనా ఏపీ ఇటీవల లేఖ రాసింది.
వరద రోజుల్లో వాడిన నీటిని కాకుండా.. వరద రోజుల తర్వాత వాడుకున్న 465 టీఎంసీలనే లెక్కలోకి తీసుకోవాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది. దీంతోపాటు సాగర్‌నుంచి నీళ్లివ్వాలని డిమాండ్పెట్టింది. ఈ క్రమంలోనే ఆయా అంశాలపై తెలంగాణ అభిప్రాయాలు చెప్పాలని బోర్డు చైర్మన్లేఖ రాశారు.
